Piyush Goyal : ఓటమి భయంతోనే ఫేక్ ప్రచారం.. ఎంవీఏ కూటమిపై కేంద్ర మంత్రి ఫైర్
మహా వికాస్ అఘాఢీ కూటమి ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సీరియస్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : మహా వికాస్ అఘాఢీ కూటమి ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్లపై అమిత్ షా గతంలో మాట్లాడిన ఎడిటెడ్ వీడియోను తప్పుడు ప్రచారానికి వాడుతున్నారని మండిపడ్డారు. ఫేక్, మార్ఫ్ చేసిన వీడియో అని స్పష్టంగా తేలిన తర్వాత కూడా కాంగ్రెస్, మహావికాస్ అఘాడీ నేతలు పదే పదే ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. అయితే ఈ ఘటనపై గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. కాంగ్రెస్, శివసేన(యూబీటీ), శరద్ పవార్ పార్టీలు పాత వీడియోను ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారని తెలిపారు. ఓటమి చెందుతామని నిరుత్సాహంతో కూటమి ఇలాంటి ప్రచారానికి తెరలేపిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం ‘మహాయుతి’ కూటమి పనిచేస్తుందని.. ఎస్టీలు, దళితులు ‘మహా వినాష్ అఘాడీ’ కూటమి మాయలో పడొద్దని హితవు పలికాడు. అమిత్ షా, మోడీ నేతృత్వంలోని మహాయుతి-ఎన్డీఏ కూటమి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్లను బలోపేతం చేయడంతో పాటు ఓబీసీలకు సరైన గౌరవం ఇచ్చామన్నారు. ‘మహా వినాష్ అఘాఢీ’ తప్పుడు హామీలను నమ్మరని.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయూతి’ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతుందన్నారు.