Akhilesh Yadav : బుల్డోజర్ యాక్షన్‌పై ‘సుప్రీం’ తీర్పు.. అఖిలేశ్, అసద్ రియాక్షన్
దిశ, నేషనల్ బ్యూరో: పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలను ఖండిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) స్వాగతించారు.
దిశ, నేషనల్ బ్యూరో: పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలను ఖండిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) స్వాగతించారు. ఇక నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు గ్యారేజీలకే పరిమితమవుతాయని ఎద్దేవా చేశారు. పేదలకు చెందిన ఏ ఒక్క ఇల్లు కూడా ఇక కూలదన్నారు. యూపీలో నవంబర్ 20న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాన్పూర్‌లో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో అఖిలేశ్ మాట్లాడారు. ‘‘సీఎం యోగి ప్రభుత్వానికి చిహ్నంగా బుల్డోజర్ మారింది. దానితో చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలను సీఎం యోగి తెలుసుకోవాలి’’ అని ఆయన సూచించారు.
అణగారిన వర్గాలకు ఊరట : అసదుద్దీన్
అణగారిన వర్గాల ఇళ్లు, ఆస్తులను కూల్చేందుకు నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తున్న బుల్డోజర్లను అడ్డుకునేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. ఇకనైనా ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలపై ప్రభుత్వాల వేధింపులు ఆగాలన్నారు. బుల్డోజర్ చర్యల నిరోధానికి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయడాన్ని సానుకూల పరిణామంగా ఆయన అభివర్ణించారు.