Ikramuddin : భారత్‌లో ఆప్ఘన్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌.. ధ్రువీకరించిన తాలిబన్లు !

ముంబైలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో తాత్కాలిక కాన్సులర్‌గా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించింది.

Update: 2024-11-13 13:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో తాత్కాలిక కాన్సులర్‌గా ఇక్రముద్దీన్ కమిల్‌ (Ikramuddin Kamil) ను తాలిబన్ ప్రభుత్వం నియమించింది. ఆప్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఆప్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు భారత్‌లో ఆఫ్ఘన్ మిషన్‌కు అపాయింట్ చేసిన మొదటి నియామకం ఇదే కావడం గమనార్హం. ఈ నియామకం భారత్‌తో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం, విదేశాలలో తన ఉనికిని పెంచుకోవడానికి తాలిబన్లు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నారు. జేపీ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఇటీవల కాబూల్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే కమిల్‌ను కాన్సులర్ గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, న్యూఢిల్లీలోని సౌత్ ఏషియా యూనివర్సిటీలో కమిల్ అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలోనే ఉంటూ ఇస్లామిక్ ఎమిరేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దౌత్యవేత్తగా తన విధులను నిర్వహిస్తున్నాడు. దీంతో అతను భారత్‌లో కాన్సులర్ సేవలను సులభతరం చేస్తారని, ఆఫ్ఘనిస్థాన్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తారని తాలిబన్లు భావిస్తున్నారు. అయితే ఈ నియామకంపై భారత్ అధికారికంగా స్పందించలేదు. తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్‌లో ఆఫ్ఘన్ దౌత్య సిబ్బంది సంఖ్య భారీగా క్షీణించింది. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన చాలా మంది దౌత్యవేత్తలు భారతదేశాన్ని విడిచిపెట్టారు.

Tags:    

Similar News