ఇద్దరు దోషులకు బహిరంగంగా మరణశిక్ష విధించిన తాలిబన్లు
రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్యకు సంబంధించి ఇద్దరిని నిదితులుగా తేలారు.
దిశ, నేషనల్ బ్యూరో: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఇద్దరు వ్యక్తులను బహిరంగంగా కాల్చి చంపారు. ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో గురువారం శిక్ష అమలు చేశారు. తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సంతకం చేసిన డెత్ వారెంట్‌ను సుప్రీంకోర్టు అధికారి అతికుల్లా దర్విష్ బిగ్గరగా చదివిన తర్వాత నగరంలో వారిద్దరిపై తుపాకీతో కాల్పులు జరిపారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్యకు సంబంధించి వారిద్దరినీ నిందితులుగా తేల్చారు. ఇన్నాళ్లు విచారణ జరిపిన తర్వాత ఆఫ్ఘాన్ సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. శిక్ష బహిరంగంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయగా, ఫుట్‌బాల్ కోర్టులో వారికి మరణదండన విధించారు. దీన్ని చూసేందుకు వేలాదిమంది స్టేడియంలో గుమిగూడారు. తాలిబన్లు గతంలోనూ దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురి చేతులను కాందహార్ ఫుట్‌బాల్ స్టేడియంలో నరికారు. ఈ ఘటనలపై ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో ఇదివరకు విధాన సలహాదారుగా బాధ్యతలు నిర్వహించిన షబ్నం నాసిమి, సరైన విచారణ లేకుండా ప్రజలకు శిక్ష విధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.