పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయాల్సిందే!
ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగగా పిలువబడే లోక్‌సభ ఎన్నికల సందడి దేశంలో మొదలైంది. మొదటి దశ పోలింగ్ రేపటి (ఏప్రిల్ 19) నుంచి ప్రారంభం కానుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగగా పిలువబడే లోక్‌సభ ఎన్నికల సందడి దేశంలో మొదలైంది. మొదటి దశ పోలింగ్ రేపటి (ఏప్రిల్ 19) నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు నిన్నటి నుంచే అధికారులు పయనమయ్యారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక ఆర్మీ చాపర్స్‌లో బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు వెళ్లడానికి ట్రెక్కింగ్ సైతం చేయాల్సి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్- సియాంగ్ జిల్లా రుంగాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు పోలింగ్ సిబ్బంది కొండలు, లోయలు దాటుతూ సాహసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూసిన నెటిజన్లు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో రెండు జాతీయ పార్టీలు చేసిన అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ప్రధాని మోడీని విమర్శిస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు 2024 ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాల్గవ దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడవది జూన్ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.