కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్టు ఆధారాలు

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా ఆయన స్పష్టం చేశారు

Update: 2024-06-19 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. రెగ్యులర్ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్ రూ. 100 కోట్లు డిమాండ్ చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్ర‌మంగా మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిన‌ట్లు కోర్టు విశ్వ‌సిస్తోందన్నారు. మనీ లాండరింగ్ కింద దాఖలైన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్‌ పేరు లేదని ఆయ‌న తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కిందికోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మే 10న సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని పేర్కొన్నారు.  


Similar News