Sanjeev Arora: ఆప్ కి చెందిన మరో కీలక నేత ఇంట్లో ఈడీ సోదాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)ని ఈడీ భయం వీడట్లేదు. ఆప్ కి చెందిన మరో కీలక నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

Update: 2024-10-07 10:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)ని ఈడీ భయం వీడట్లేదు. ఆప్ కి చెందిన మరో కీలక నేత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మనీలాండరింగ్‌ కేసు (money laundering case)లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోరా (Sanjeev Arora) నివాసంలో తనిఖీలు చేపట్టారు. భూ అక్రమణలకు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ (Punjab)లోని లుథియానాలో గల ఎంపీ నివాసం, కార్యాలయాలతోపాటు బంధువుల ఇళ్లలో సోమవారం ఉదయం నుంచే ఈడీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈడీ సోదాలపై ఎంపీ సంజీవ్‌ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. అయితే, ఈడీ సోదాలకు గల కారణాలు కూడా ఏంటో తనకు తెలియదని చెప్పారు. అయితే, చట్టాన్ని అనుసరించే సామాన్యుడిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.

ఆప్ ఏమందంటే?

ఇకపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలు కీలక నేతలు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ సహా పలువురు నేతలు అరెస్టు అయ్యారు. అయితే, ప్రస్తుతం జరుగతున్న ఈడీ తనిఖీలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వంపై ఆప్‌ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా సోదాలు చేస్తున్నట్లు నిప్పులు చెరిగారు.


Similar News