చెవి కోసేసి, కరెంట్ షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో దారుణాలు

బాధితుడిని చిత్రహింసలు పెట్టడంతో అధిక రక్తస్రావం కారణంగా మరణించాడు.

Update: 2024-06-19 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. హత్య చేయడానికి ముందు అతడిని చిత్ర హింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దారుణంగా కొట్టి, కరెంట్ షాక్ ఇచ్చినట్లు తేలింది. పోలీసుల కథనం ప్రకారం, జూన్ 9న బెంగళూరులోని ఫ్లైఓవర్ సమీపంలో రేణుకస్వామిని కిడ్నాప్ చేశారు. ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి చెక్క కర్రలతో దాడి చేశారు. బాధితుడిని చిత్రహింసలు పెట్టడంతో అధిక రక్తస్రావం కారణంగా మరణించాడు. అతడిపై పవిత్రా గౌడ, దర్శన్‌తోపాటు మిగిలిన వారు కూడా విపరీతంగా దాడి చేసినట్లు సమాచారం. బాధితుడి శరీరంపై మొత్తం 39 గాయాలుండగా, వాటిలో ఏడు, ఎనిమిదిచోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు. రేణుకాస్వామిని తన్నడం వల్ల అతడి వృషణాలు పగిలిపోయాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అతని చెవి ఒకటి కూడా లేదు. నోరు పగిలిపోయింది. రేణుకాస్వామిపై మొదట పవిత్రాగౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని ఆమె కాళ్లపై పడి వేడుకొన్నప్పటికీ.. ఆమె కొట్టిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30 లక్షలు ఇచ్చేలా నటుడు దర్శన్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తన పేరు ఎక్కడా బయటకు పొక్కకుండా చూడాలని వారిని ఒప్పించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రదోష్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.


Similar News