S Jaishankar: శ్రీలంక పర్యటనకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సమావేశం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యంపై చర్చించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం శ్రీలంకను సందర్శించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార్ దిసనాయకెతో భేటీ కానున్నారు. అంతేకాకుండా శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సమావేశం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. భారత్ అనుసరిస్తున్న నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీతో పాటు ఇరుదేశాల పరస్పర ప్రయోజనం కోసం దీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా విదేశాంగ విధానానికి సంబంధించి పునర్‌వ్యవస్థీకరణ, మునుపటి అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె హయాంలో ఖరారైన భారతీయ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల సమీక్షపై చర్చించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా దిసనాయకె ఎన్నికైన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగే మొదటి అత్యున్నత స్థాయి చర్చ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్న మొదటి విదేశాంగ మంత్రి కూడా జైశంకర్ కావడం విశేషం.