Kanimozhi : పొంగల్ పండుగ తేదీల్లో యూజీసీ నెట్ పరీక్షలా ? : కనిమొళి
దిశ, నేషనల్ బ్యూరో : యూజీసీ నెట్(UGC NET) పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) లేఖ రాశారు.
దిశ, నేషనల్ బ్యూరో : యూజీసీ నెట్(UGC NET) పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) లేఖ రాశారు. జనవరి 15, 16 తేదీల్లో పొంగల్ పండుగ ఉందని.. ఆ రెండు రోజులకు సంబంధించిన యూజీసీ నెట్ పరీక్షల తేదీలను మార్చాలని కోరారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖను ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ‘‘ఏ అంశాన్ని కూడా పట్టించుకోకుండా పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ నిర్ణయిస్తోంది. పొంగల్ పండుగ తేదీల్లో షెడ్యూల్ చేసిన సీఏ పరీక్షల తేదీలను మార్పించేందుకు మేం ఇటీవలే పోరాడాల్సి వచ్చింది. తమిళనాడు(Tamil Nadu) ప్రజల సెంటిమెంట్లను కేంద్రంలోని బీజేపీ సర్కారు పరిగణనలోకి తీసుకోవడం లేదనే సంకేతాలిచ్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి’’ అని కనిమొళి పేర్కొన్నారు.
‘‘పొంగల్ అనేది పండుగ మాత్రమే కాదు. అది తమిళులకు గర్వకారణమైన సందర్భం. మా ఉనికికి ప్రతీక. మా కల్చరల్ వారసత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు అనిపించేలా కేంద్ర సర్కారు వైఖరిని ప్రదర్శిస్తోంది’’ అని ఆమె మండిపడ్డారు. ‘‘చదువు, సంప్రదాయం మధ్య ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితిని తమిళనాడు విద్యార్థులకు తేవొద్దు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కనిమొళి కోరారు.