DRDO: VSHORADS క్షిపణి పరీక్ష సక్సెస్.. డీఆర్డీఓ మరో విజయం

డీఆర్డీఓ మరో విజయాన్ని సాధించింది. నాలుగో తరం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ (VSHORADS) క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.

Update: 2024-10-05 11:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: డీఆర్డీఓ మరో విజయాన్ని సాధించింది. నాలుగో తరం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ (VSHORADS) క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్ అటామిక్ రేంజ్‌లో శనివారం నిర్వహించారు. దేశీయంగా రూపొందించిన ఈ స్వల్ప-శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని చేధించినట్టు డీఆర్డీవో అధికారులు తెలిపారు. మూడు క్షిపణలను ఒకే రోజు పరీక్షించినట్టు వెల్లడించారు. ఈ క్షిపణి శత్రు విమానాలు, డ్రోన్లు, ఇతర వైమాణిక లక్ష్యాలను తక్కువ ఎత్తు వద్ద ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఈ పరీక్షకు సహకరించిన డీఆర్డీఓ, ఇండియన్ ఆర్మీ, ఇతర కంపెనీలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. పోఖ్రాన్ నుంచి సాంకేతిక అధునాతన ఆయుధ వ్యవస్థ VSHORADS పరీక్షలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కొత్త క్షిపణి వైమానిక దాడులకు వ్యతిరేకంగా సాయుధ దళాలకు మరింత సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని కొనియాడారు. ఈ క్షిపణులను గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, శత్రు విమానాలు, డ్రోన్లు, ఇతర వైమానిక లక్ష్యాలను ఎదుర్కోవడానికి భద్రతా దళాల అవసరాలను అవి తీరుస్తాయని వెల్లడించారు.

VSHORADS అంటే?

ఇది డీఆర్డీఓ, భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) హైదరాబాద్‌చే స్వదేశీయంగా రూపొందించబడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ క్షిపణిలో స్మాల్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటి అనేక కొత్త సాంకేతికతలు ఉన్నాయి. ఇందులో భాగంగా మూడు క్షిపణులను అభివృద్ధి చేశారు. ఇది తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. కాగా, అంతకుముందు భారత్ ఈ ఏడాది మేలో స్వదేశీ రుద్రమ్-II ఎయిర్-టు గ్రౌండ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని పరీక్షించారు. దీనిని కూడా డీఆర్డీఓ తయారు చేసింది. 


Similar News