'అనవసరంగా వాయిదా వేయవద్దు': బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బెయిల్ పిటిషన్లను అనవసరంగా వాయిదా వేయవద్దని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2024-06-25 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఓ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. బెయిల్ పిటిషన్లను అనవసరంగా వాయిదా వేయవద్దని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సత్యేందర్ జైన్ బెయిల్ విజ్ఞప్తిపై తదుపరి విచారణలో ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను విచారించకుండా ఢిల్లీ హైకోర్టు సుధీర్ఘకాలం వాయిదా వేయడంపై సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్ ఆరు వారాల పాటు వాయిదా వేయబడిన అంశాన్ని కోర్టు ముందుంచారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం 'హైకోర్టు ఈ విషయంపై వేగంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు' అభిప్రాయపడింది. కాగా, ఈ వ్యవహారాన్ని జూలై 9న ఢిల్లీ హైకోర్టు విచారణకు తీసుకోనుంది. దీంతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపైనా సుప్రీంకోర్టు ఇటీవల ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది అసాధారణ నిర్ణయమని పేర్కొంది.


Similar News