జమ్మూకశ్మీర్‌ పరిస్థితులను సమీక్షించిన ప్రధాని మోడీ

ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Update: 2024-06-13 15:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ-కశ్మీర్‌లో వరుస ఉగ్రవాద దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతకు సంబంధించిన పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్, జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెట్ గవర్నర్ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రతా సంబంధిత పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి ఆయన హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడారు.

యాత్రికులను లక్ష్యంగా చేసుకుని గత ఆదివారం రియాసీలో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. ఆ తర్వాత రెండురోజులకు దోడా జిల్లాలో చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు. అదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. అదే రాత్రి హీరానగర్‌లోని సైదా సుఖల్ గ్రామంలోని ఇంటిపై దాడి, ఆ తర్వాత కథువా జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్ జవా, ఒక ఉగ్రవాది మరణించారు. బుధవారం సాయంత్రం సైతం దోడా జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు అధికారి గాయపడ్డాడు.

రియాసీలో యాత్రికుల పర్యాటక బస్సుపై జరిగిన దాడికి సంబంధించి తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన విస్తృతమైన దర్యాప్తు తర్వాత ఈ దాడిలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించామని ఓ అధికారి చెప్పారు. ఈ ప్రాంతాలు 1995-2005 మధ్య తీవ్రవాద కేంద్రాలుగా ఉన్నాయని ఆయన తెలిపారు.  


Similar News