ఉగ్రదాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి- రాహుల గాంధీ

జమ్ము కశ్మీర్‌లో దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గతకొన్ని నెలలుగా భారత ఆర్మీపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరం అని అన్నారు

Update: 2024-07-16 08:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లో దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. గతకొన్ని నెలలుగా భారత ఆర్మీపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరం అని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఇలాంటి భద్రతా వైఫల్యానికి ప్రభుత్వ విధానాలే కారణం అని విమర్శించారు. ఈమేరుక ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రదాడిలో ఐదుగురు అమరులయ్యారు. వారందరికి నా హృదయపూర్వక నివాళులు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. సైనికులపై ఇలాంటి దాడులు జరగడం విచారకరం. ఈ దాడులు ఆందోళనకరం. బీజేపీ తప్పులు విధానాల భారం అక్కడి సైనికులు, ప్రజలపై పడింది. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని దేశభక్తిగల ప్రతి భారతీయుడి డిమాండ్. దేశ సైనికులకు హాని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి’’ అని రాహుల్‌ తన ఎక్స్ లో పేర్కొన్నారు.

రాజకీయ ఐక్యత అవసరం

ఏది ఏమైనప్పటికీ.. ఈ సమయంలో రాజకీయ ఐక్యత ఆవశ్యకతను రాహుల్ గాంధీ నొక్కిచెప్పారు. ఉగ్రవాద ముప్పుపై ప్రతిపక్షం కూడా మద్దతివాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. ఇలాంటి కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఒక్కతాటిపై నిలబడిందని అన్నారు. గత 32 నెలల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 48 మంది సైనికులు మృతి చెందారు. ఈ నెలలో జరిగిన రెండు దాడుల్లోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.


Similar News