Delhi: స్కూళ్లలో బంగ్లాదేశ్ కు చెందిన పిల్లలుంటే చెప్పండి.. ఢిల్లీ మున్సిపాలిటీ కీలక ఆదేశాలు జారీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అక్కడి స్కూళ్లకు కీలక సర్క్యూలర్ జారీ చేసింది. స్కూళ్లలో బంగ్లాదేశ్ కు చెందిన పిల్లలుంటే.. తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అక్కడి స్కూళ్లకు కీలక సర్క్యూలర్ జారీ చేసింది. స్కూళ్లలో బంగ్లాదేశ్ కు చెందిన పిల్లలుంటే.. తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడించింది. స్కూళ్లలో చదువుకుంటున్న అక్రమ వలసదారుల (Bangladeshi migrants) పిల్లలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాని విషయం గుర్తించుకోవాలని సూచించింది. ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలని ఇదివరకే లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని ఆయా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు చేసిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని అన్ని మున్సిపల్ జోన్‌లను కార్పొరేషన్ ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ ద్వారా యాక్షన్ టేకప్ రిపోర్ట్‌ను సమర్పించాలని కోరింది. ‘‘ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్‌లను చేపట్టాలని కోరాము’’ అని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.
అక్రమ వలసలు
ఇకపోతే, త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ వలసదారుల అంశమే అధికార ఆప్, బీజేపీ మధ్య వలసదారుల సమస్య అనే అంశం కీలకం కానుంది. ఇకపోతే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఆదేశాలపై ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) స్పందించారు. అక్రమ వలసదారుల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన ప్రజలను అవమానపరుస్తోందని అన్నారు. రోహింగ్యా, బంగ్లాదేశీ చొరబాటుదారుల జాబితాలో చేర్చారని వారు మండిపడ్డారు. ఈ ఆర్డర్ ద్వారా ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వలస వచ్చిన పేదలను అగౌరవపరచాలని.. వారి నివాసాలు, దుకాణాలను కూల్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.