Election Rules : ‘ఎన్నికల నిర్వహణ నియమావళి’లో కీలక సవరణ.. రూల్ నంబర్ 93లో మార్పులు

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఎన్నికల నిర్వహణ నియమావళి -1961’లోని రూల్ నంబర్ 93(election rules)ని కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది.

Update: 2024-12-21 13:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఎన్నికల నిర్వహణ నియమావళి -1961’లోని రూల్ నంబర్ 93(election rules)ని కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన సిఫార్సుల ఆధారంగానే ఈ సవరణ చేశామని కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. ఈ సవరణ వల్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వీడియో రికార్డింగ్స్, సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ వంటి ఎలక్ట్రానిక్ రికార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని వెల్లడించింది. ఇకపై ఈ సమాచారాన్ని ప్రజలు నేరుగా పొందలేరని స్పష్టం చేసింది. ఇంతకుముందు రూల్ నంబర్ 93 ప్రకారం.. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన అన్ని రకాల పత్రాలతో పాటు పైన మనం చెప్పుకున్న ఎలక్ట్రానిక్ రికార్డులన్నీ ప్రజలకు ఓపెన్‌గా అందుబాటులో ఉండేవి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే తాజాగా ‘ఎన్నికల నిర్వహణ నియమావళి-1961’లోని రూల్ నంబర్ 93కి కేంద్ర సర్కారు చేసిన సవరణ వల్ల ఎలక్ట్రానిక్ రికార్డులను నేరుగా చూసే అవకాశాన్ని ప్రజలు కోల్పోయారు.

ప్రజా తనిఖీ కేటగిరీలో ఉన్నవి ఇవే..

ఓ కోర్టు కేసు కారణంగా రూల్ నంబర్ 93కి సవరణ చేయాల్సి వచ్చిందని కేంద్ర న్యాయశాఖ, ఈసీ(Election Commission) అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ ఏజెంట్ల నియామకాలు, ఎన్నికల ఫలితాలు, ఎలక్షన్ అకౌంట్ స్టేట్‌మెంట్లు వంటివన్నీ ప్రజలు తనిఖీ చేయదగిన కేటగిరీలో ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు సహా మిగతా ఏ సమాచారాన్ని కూడా ప్రజలు ఇకపై నేరుగా తనిఖీ చేయలేరు. ఎలక్ట్రానిక్ రికార్డుల(electronic poll documents)ను ఇష్టానుసారంగా ఎడిట్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముప్పు ఉన్నందున వాటిని ఇక ఓపెన్‌గా అందుబాటులో ఉంచరని ఎన్నికల సంఘం అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ రికార్డులను పొందొచ్చన్నారు. ఒకవేళ ప్రజానీకంలో ఎవరైనా ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేయాలని భావిస్తే నేరుగా కోర్టులను ఆశ్రయించొచ్చని ఈసీ అధికార వర్గాలు చెప్పాయి.

ఈ కోర్టు కేసు వల్లే..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు, ఫామ్స్ 17-సీ పార్ట్ 1, పార్ట్ 2లను తనకు అందించాలంటూ అడ్వకేట్ మహమూద్ ప్రాచా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ అందించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలోనే రూల్ నంబర్ 93ని కేంద్ర ప్రభుత్వం సవరించింది.

ఈసీ ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదు : జైరాం రమేష్

‘‘ఎన్నికలకు సంబంధించి ప్రజలు అడిగే అన్ని రకాల సమాచారాన్ని అందించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం నడుచుకుంటే సరిపోయేది. అంత మాత్రం దానికి ఈసీ హైరానా పడిపోయి ఏకంగా ఎన్నికల నిర్వహణ నియామవళికి సవరణ చేయించింది. ఎన్నికల సమాచారానికి సంబంధించిన పారదర్శకత విషయంలో ఈసీ ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదు. ఎన్నికల సమాచారం ఓపెన్‌గా అందుబాటులో ఉంటేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News