Delhi pollution: వరుసగా మూడో రోజు ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం(Delhi pollution) పెరిగిపోయింది. ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలముకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం(Delhi pollution) పెరిగిపోయింది. ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా మూడోరోజు వాయునాణ్యత సూచీ (AQI) తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఉదయం ఏక్యూఐ 409కి చేరుకుంది. గురువారం 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3 (GRAP- 3)ని అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతేకాకుండా, తదుపరి నోటీసులు వచ్చే వరకు ఐదో తరగతి వరకు పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లు బోధించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ప్రైమరీ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారానే బోధన జరుగుతోంది.
స్టేజ్ 3 ఆంక్షలు
స్టేజ్ 3 ఆంక్షల ప్రకారం.. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదులోపు తరగతుల విద్యార్థులకు సెలవు ఇస్తారు. అంతే కాకుండా ఢిల్లీ నుంచి అంతర్రాష్ట్ర బస్సులపై ఆంక్షలు విధించింది. ఎలక్ట్రిక్, సీఎన్ జీ (CNG), బీఎస్-4 (BS-VI) డీజిల్ వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గత రెండ్రోజుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.