Indian Woman :ట్రావెల్ ఏజెంట్ మోసం.. 22 ఏళ్లు పాక్‌లోనే.. ఎట్టకేలకు తిరిగొచ్చిన హమీదా
దిశ, నేషనల్ బ్యూరో : హమీదా బానూ ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత పాకిస్తాన్(Pakistan) నుంచి తన స్వదేశం భారత్‌కు తిరిగి చేరుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : హమీదా బానూ ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత పాకిస్తాన్(Pakistan) నుంచి తన స్వదేశం భారత్‌కు తిరిగి చేరుకుంది. ఓ ట్రావెల్ ఏజెంట్(Travel Agent) చేసిన మోసం వల్ల 2002 సంవత్సరంలో ఆమె ముంబై నుంచి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న హైదరాబాద్‌కు చేరింది. వంట పని ఉద్యోగం కోసం దుబాయ్‌కు తీసుకెళ్తానని నమ్మించిన ట్రావెల్ ఏజెంట్.. ఆమెను పాకిస్తాన్‌లో దిగబెట్టి దగా చేశాడు. అక్కడ కరాచీకి చెందిన ఓ వ్యక్తిని హమీదా బానూ పెళ్లి చేసుకున్నారు. ఆయన కరోనా వ్యాధితో కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. అప్పటి నుంచి తన సవతి కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. కరాచీకి చెందిన యూట్యూబర్ వలీవుల్లా మరూఫ్ ఒకసారి హమీదా బానూను కలిశాడు. ఆమె నేపథ్యం గురించి తెలుసుకొని ఒక వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోను భారత్‌లో ఉన్న హమీదా బానూ(Indian Woman) కూతురు యాస్మీన్ చూసింది. వీడియోలో ఉన్నది తన తల్లే అని గుర్తుపట్టింది. సదరు యూట్యూబర్ ద్వారా తన తల్లికి కాల్ చేసి మాట్లాడింది. హమీదా బానూ కూతురు యాస్మీన్ పాకిస్తాన్‌లోని భారత ఎంబసీని సంప్రదించి.. తన తల్లి స్వదేశానికి తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేయించారు. సోమవారం రోజు వాఘా సరిహద్దు మీదుగా భారత్‌లోకి హమీదా అడుగుపెట్టారు. ముంబై నుంచి పాకిస్తాన్‌కు వెళ్లడానికి ముందు హమీదాకు పెళ్లయింది. భర్త చనిపోయారు. నలుగురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో పిల్లలను కుటుంబీకుల వద్ద వదిలి.. ఆమె పలుమార్లు ఖతర్, సౌదీ, దుబాయ్‌లకు వెళ్లి జాబ్ చేసి తిరిగొచ్చారు. ఈక్రమంలోనే ఓసారి ట్రావెల్ ఏజెంట్ మోసానికి బలయ్యారు. పాకిస్తాన్‌కు వెళ్లి దశాబ్దాల తరబడి చిక్కుకుపోయారు.