Syria: ఆరు నెలల్లో స్వదేశానికి వెళ్లనున్న 10 లక్షల మంది సిరియన్లు: యూఎన్ ఏజెన్సీ
సిరియన్ శరణార్థులను తమ దేశానికి పంపించే విషయంపై వారిని ఒత్తిడి చేయవద్దని ఐక్యరాజ్యసమితి సంబంధిత దేశాలను కోరింది.
దిశ, నేషనల్ బ్యూరో: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను అధికారం కోల్పోవడంతో ఇతర దేశాల్లో ఉన్న సిరియా వాసులు స్వంత దేశానికి తిరిగెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిస్థితులను బట్టి రాబోయే ఆరు నెలల కాలంలో 10 లక్షల మంది సిరియన్లు స్వదేశానికి వెళ్లనున్నారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో సిరియన్ శరణార్థులను తమ దేశానికి పంపించే విషయంపై వారిని ఒత్తిడి చేయవద్దని ఐక్యరాజ్యసమితి సంబంధిత దేశాలను కోరింది. 13 సంవత్సరాల అంతర్యుద్ధం కారణంగా దేశం నుంచి పారిపోయిన లక్షలాది మంది ప్రజల్లో కొందరు తిరిగి వచ్చే అవకాశం ఉంది. 2025, జూన్ నాటికి 10 లక్షల మంది స్వదేశానికి చేరుకోవచ్చని యూఎన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. వీరందరికీ పెద్ద స్థాయిలో మానవతా సాయం అవసరం. దీనికోసం దాతల నుంచి సాయం కోరుతున్నామని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం రీజనల్ డైరెక్టర్ రెమా జామస్ చెప్పారు. కాగా, వివిధ నివేదికల ప్రకారం.. దశాబ్దానికి పైగా కొనసాగించ అంతర్యుద్ధం కారణంగా 1.3 కోట్ల మంది సిరియన్లు స్వంత దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. వారంతా లెబనాన్, తుర్కియె, జోర్డాన్‌లలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. ఈ మధ్య తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్న తర్వాత చాలామంది సిరియా దేశస్థులు స్వదేశానికి తిరిగి పయనమవుతున్నారు.