Manoj Jarange: మరాఠా కోటా కోసం మరోసారి దీక్ష.. మనోజ్ జరాంగే కీలక ప్రకటన

మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ కేటగిరీలో ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మరోసారి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించనున్నట్టు మనోజ్ జరాంగే ప్రకటించారు.

Update: 2024-12-17 17:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ (OBC) కేటగిరీలో ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఏడాది జనవరి 25 నుంచి మరోసారి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించనున్నట్టు సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే (Manoj Jarange) ప్రకటించారు. మరాఠా కమ్యూనిటీ ప్రజలు ఇంట్లో ఉండకుండా పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరాఠా కమ్యూనిటీకి చెందిన ఎవరైనా దీక్షలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. మరాఠా కమ్యూనిటీ డిమాండ్లను ఆమోదించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, మరాఠా సమాజానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుంబీ సర్టిఫికెట్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కాగా, మరాఠా కోటా కోసం జరాంగే గతంలోనే అనేక దీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కేటగిరీ కింద విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహాయుతి ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఓబీసీ కోటా కింద కోటా కల్పించాలని జరాంగే డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News