ఢిల్లీ మంత్రులు మీటింగ్‌లకు రావట్లేదు: కేంద్ర హోంశాఖకు ఎల్జీ లేఖ

Update: 2024-04-08 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సీఎం కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఢిల్లీ మంత్రులు మీటింగ్‌లకు రావట్లేదంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా లేఖ రాశారు. నీరు, విద్య, ఆరోగ్యం, రవాణా, పర్యావరణం, అటవీ వంటి శాఖలకు సంబంధించిన కీలక మంత్రులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని, కానీ, ఆ మీటింగ్‌లకు మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు హాజరుకాలేదని లేఖలో పేర్కొన్నారు. తమ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని తెలిపారు. ఎన్నికల మోడల్ కోడ్ ఉన్నందునే తాము హాజరుకావట్లేదని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ కారణం చెప్పి సమావేశానికి గైర్హాజరవడంపై వీకే సక్సేనా లేఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరుకాకపోవడానికి ఇచ్చిన కారణాలు అస్పష్టంగా ఉన్నాయని, ఢిల్లీ పౌరుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే విషయాల పట్ల మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘సీఎంను అరెస్టు చేసి నిర్బంధించిన నేపథ్యంలో సాధారణ పాలనా పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ తరహా సంప్రదింపులు అవసరమని లెఫ్టినెంట్ గవర్నర్ విశ్వసిస్తున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.



Similar News