ఢిల్లీలో హైటెన్షన్ .. ఆప్ శ్రేణుల నిరసనలు.. మంత్రులు అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి.

Update: 2024-03-22 16:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉదయం ఆప్ తన ఆఫీస్ బేరర్లు, మంత్రులు, కౌన్సిలర్లందరినీ ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలకు పిలుపునిచ్చింది. హస్తినలోని ఐటీఓ చౌక్, రాజ్ ఘాట్, వికాస్ మార్గ్ పరిసరాల్లో ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆయా ఏరియాల్లో 144 సెక్షన్ విధించి, నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ఆప్ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసుల టీమ్ రాష్ట్ర మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్, ఆప్ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆప్, బీజేపీ, ఈడీ కార్యాలయాల వైపు వెళ్లే రోడ్లను మూసివేశారు. ఈ మార్గాల్లో ఆప్ క్యాడర్ నిరసనలకు దిగితే నియంత్రించేందుకు వాటర్‌ ఫిరంగులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసుల సలహా మేరకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఐటీఎం మెట్రో స్టేషన్‌ను కూడా మూసివేశారు. ఇక కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఈడీ ఆఫీసు ఎదుట డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనల్లో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ పాల్గొన్నారు. కేరళలోని ఎర్నాకుళంలో ఉన్న బీజేపీ కార్యాలయం వరకు ఆప్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. తిరువనంతపురంలో సీపీఎం, కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశాయి.

నిరసనలకు ఆప్ కార్యాచరణ ప్రణాళిక..

సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాందోళనల నిర్వహణకు కార్యాచరణ ప్రకటించింది. శనివారం రోజు (మార్చి 23న) పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆప్ శ్రేణులు, ఇండియా కూటమి నేతలతో కలిసి ఢిల్లీలోని అమరవీరుల పార్కు వద్దకు ప్రదర్శనగా వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆదివారం (మార్చి 24న) దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో కలిసి ఆప్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. సోమవారం (మార్చి 25న) హోలీ పండుగ ఉంది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆ రోజున ఆప్ క్యాడర్ ఎలాంటి హోలీ కార్యక్రమాలను నిర్వహించదు. మంగళవారం (మార్చి 26న) ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసాన్ని ఆప్ శ్రేణులు ఘెరావ్ చేయనున్నాయి.

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్ కుటుంబం?

సీఎం కేజ్రీవాల్ కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌ నివాసానికి మంత్రి వెళ్లగా ఆయనను లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం అరెస్టయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు సరే.. ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష?’’ అని భద్రతా సిబ్బందిపై గోపాల్‌ రాయ్‌ మండిపడ్డారు.

Tags:    

Similar News