కుట్ర పూరితంగా హర్యానా ఢిల్లీకి నీటి ప్రవాహాన్ని తగ్గించింది: అతిషి

దేశ రాజధాని ఢిల్లీకి గత మూడు రోజులుగా హర్యానా ప్రభుత్వం కుట్ర పూరితంగా నీటి విడుదలను తగ్గించిందని ఢిల్లీ నీటి మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు.

Update: 2024-06-07 09:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీకి గత మూడు రోజులుగా హర్యానా ప్రభుత్వం కుట్ర పూరితంగా నీటి విడుదలను తగ్గించిందని ఢిల్లీ నీటి మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల నగర ప్రజల అవసరాల కోసం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆమె, సుప్రీంకోర్టు ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది, కానీ హర్యానా ఢిల్లీ ప్రజలపై కుట్ర చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా, హర్యానా క్రమంగా ఢిల్లీకి విడుదల చేస్తున్న నీటిని తగ్గిస్తుంది. గత 3 రోజుల్లో చాలా వరకు నీటి ప్రవాహం తగ్గిందని ఆమె అన్నారు.

ఈ సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం కారణంగా నీటి డిమాండ్ పెరిగింది, నగరంలో బోర్ల నుంచి తక్కువ మొత్తంలో నీరు బయటకు వచ్చేది. యమునాలో నీటి మట్టం కూడా తగ్గడంతో రాజధాని ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి ఆప్ మంత్రి అతిషి హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని లేఖ రాయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్‌ను ఆదేశించడంతో పాటు, హర్యానా కూడా విడుదలైన నీటిని ఢిల్లీకి సరిగ్గా చేరేలా చర్యలను తీసుకోవాలని సూచించింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చిన రెండు రోజులకు మంత్రి అతిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Similar News