హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలెర్ట్!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ‘హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌’ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Update: 2023-08-15 14:25 GMT

హిమాచల్ ప్రదేశ్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ‘హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌’ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో మరణించిన వారి సంఖ్య 55కి చేరుకుంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, పిడుగుపాట్లతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే 24 గంటలపాటు ‘భారీ నుంచి అతి భారీ వర్షాలు’ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాల ప్రభావంతో..

* హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ఇప్పటికే 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. చిక్కుకుపోయిన వారిని రక్షించడంపై దృష్టి సారిస్తున్నట్లు సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ప్రధాన రహదారులు తెరవబడ్డాయని.. రాష్ట్ర రహదారులు పనిచేయడానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.

* భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ.. ఆగస్టు 19 వరకు బోధనా కార్యకలాపాలు నిలిపివేసింది. వాతావరణ సూచనల ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, పౌరి, టెహ్రీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* రిషికేశ్‌లో వర్ష సంబంధిత ఘటనల తర్వాత ముగ్గురు వ్యక్తులు మరణించగా.. 10 మంది తప్పిపోయారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లే రహదారులన్నీ కొండచరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో మరో రెండు రోజుల పాటు చార్‌ధామ్ యాత్రను నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

* హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి విపత్తు ప్రభావం ప్రధానంగా మండి జిల్లాతో పాటు సిమ్లా పట్టణంలో అధికంగా ఉందని ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా తెలిపారు. ఒక్క సిమ్లా పట్టణంలోనే 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి పైగా తప్పిపోయారు. శివాలయంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

* ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడటం నివాసితుల్లో భయాందోళనలు పెరిగాయి. కల్కా-సిమ్లా, కిరాత్‌పూర్-మనాలి, పఠాన్‌కోట్-మండి, ధర్మశాల-సిమ్లా సహా కొండ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్నీ సోమవారం బ్లాక్ చేయబడ్డాయి.


Similar News