మొదలైన రూ. 2 వేల నోట్ల మార్పిడి.. ఐడీ కార్డులు అడుగుతున్న పలు బ్యాంకులు

నిషేధిత రూ. 2,000 నోటు మార్పిడి లేదా డిపాజిట్ ప్రక్రియ తొలిరోజు సోమవారం ప్రారంభమైంది.

Update: 2023-05-23 15:08 GMT

న్యూఢిల్లీ: నిషేధిత రూ. 2,000 నోటు మార్పిడి లేదా డిపాజిట్ ప్రక్రియ తొలిరోజు సోమవారం ప్రారంభమైంది. అయితే గుర్తింపు కార్డులు, అధికారిక ఫారమ్‌లపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఐడీ కార్డులు, ఫారమ్‌లపై బ్యాంకులు ఏమంటున్నాయో ఓసారి చూద్దాం.. బ్యాంకులు గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఖాతాదారులను డిమాండ్ చేస్తున్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి. బ్యాంకుల్లో స్థిరమైన విధానం లేకపోవడాన్ని ఇది సూచిస్తోంది. కొంత మంది ఖాతాదారులు ఐడీ ప్రూఫ్‌లు అడగలేదని చెబుతుంటే.. మరికొంత మంది వాటిని ఇచ్చామని అంటున్నారు.

చాలా బ్యాంకులు నోట్లను మార్చుకునేందుకు నిరాకరించాయి. బదులుగా డిపాజిట్ చేయమని కోరాయి. రూ.2000 నోట్లను మార్చేటప్పుడు లేదా డిపాజిట్ చేసేటప్పుడు ఎటువంటి ఫారమ్ లేదా ఐడీ ప్రూఫ్ అవసరం లేదని భారత అతిపెద్ద పబ్లిక్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇదిలావుంటే గుర్తింపు కార్డులు, ఫారమ్‌లపై తమకు ప్రత్యేక మార్గదర్శకాలున్నాయని ప్రధాన బ్యాంకులు చెప్పాయి.

ఖాతాలేని వారిని మాత్రమే ఐడీ ప్రూఫ్ అడుతున్నట్టు కొటక్ బ్యాంక్ తెలిపింది. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఫారమ్ లేదా ఐడీ ప్రూఫ్‌లను అడగడం లేదు. హెచ్ఎస్‌బీసీ, ఫెడరల్ బ్యాంకులు ఖాతా లేని వారికి ఐడీ ప్రూఫ్ అడుగుతున్నాయి. ఫారమ్ అవసరం లేదని చెబుతున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ కస్టమర్లను ఫారమ్ నింపమని అడుగుతోంది. ఖాతాలేని వారిని మాత్రమే ఐడీ ప్రూఫ్ ఇవ్వమని కోరుతోంది. తమకు ఎలాంటి ఫారమ్ కానీ ఐడీ కానీ అవసరం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెబుతోంది.

కానీ ఢిల్లీలోని కరోల్ బాగ్ బ్రాంచ్ మాత్రం చెల్లుబాటయ్యే అధికారిక పత్రం అవసరమని బ్యాంక్ ఎంట్రెన్స్ వద్దే ఓ పోస్టర్‌ను అతికించింది. ఢిల్లీలోని ఓ కస్టమర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పీఎన్‌బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్‌లకు వెళ్లానని నోటు మార్చుకోవడానికి నిరాకరించారని.. డిపాజిట్ చేయమని కోరుతున్నారని తెలిపాడు. మొత్తానికి ఈ రూ. 2000 నోట్లను వదిలించుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News