ముంబైలో అడుగుపెట్టిన మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్.. పెను విధ్వంసం తప్పదని NIA వార్నింగ్!
దిశ, వెబ్‌డెస్క్: ముంబై పోలీసులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అలర్ట్ చేసింది. టెర్రరిస్ట్ సర్ఫరాజ్ మెమన్ ముంబైలోకి చొరబడినట్లు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్, చైనా, హాంకాంగ్‌లో శిక్షణ పొందిన మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ సర్ఫరాజ్ మెమన్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని.. అతడిని హైస్పీడ్‌లో ట్రాక్ చేయాలని ఎన్ఐఏ ముంబై పోలీసులను ఆదేశించింది. వీలైనంత త్వరగా సర్ఫరాజ్‌ను పట్టుకోకుంటే పెను విధ్వంసం జరగవచ్చని హెచ్చరించింది.
కాగా, సర్ఫరాజ్ మెమన్ స్వస్థలం మధ్యప్రదేశ్‌గా ఎన్ఐఏ గుర్తించింది. ఎన్ఐఏ ఆదేశాలతో ముంబై పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రముఖ పర్యాటక స్థలాలు, హోటళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే స్థలాల్లో పోలీస్ బలగాలను మెహరించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ సర్ఫరాజ్ ముంబైలోకి అడుగు పెట్టడంతో దేశ ఆర్థిక రాజధానిలో మరో భారీ టెర్రర్ ఎటాక్‌కు ఏమైనా ప్లాన్ చేశారా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.