అవినీతి మంత్రికి ప్రశంసలా.. బీజేపీని మరింత ఇరుకున పెట్టిన మోడీ ఫోన్ కాల్..?

మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

Update: 2023-04-21 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కర్ణాటక రాజకీయం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ మాజీ మంత్రి ఈశ్వరప్పకు చేసిన ఫోన్ చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపినప్పటికీ పార్టీ టికెట్ దక్కక పోటీకి దూరంగా ఉంటున్న ఈశ్వరప్పతో శుక్రవారం ప్రధాని స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. పోటీ చేసేందుకు అవకాశం రాని ఇతర నేతలు పార్టీ మారుతుంటే ఈశ్వరప్ప బీజేపీలోనే ఉండటంతో ఆయన నిబద్ధతను ప్రధాని ప్రశంసించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మోడీ ఫోన్‌పై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. అవినీతి ఆరోపణలు వచ్చిన నేతకు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడటం,ఆయనపై ప్రశంసలు కురిపించడం ఏంటని ప్రశ్నిస్తోంది.

కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్పపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బెలగావిలో అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేశారని సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఈశ్వరప్పపై ఆరోపణలు చేస్తూ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం అయింది. ఈశ్వరప్పపై వస్తున్న ఆరోపణల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుండటంతో గతేడాది ఏప్రిల్‌లో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తికి ప్రధాని మోడీ ఫోన్ చేసి అభినందించడం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ అవినీతిని సమర్ధిస్తోదని బీజేపీపై ఎటాక్ ప్రారంభించింది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News