సీట్ల సర్దుబాటుపై ‘ఇండియా’ చర్చలు షురూ.. తొలి భేటీ వివరాలివీ

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎట్టకేలకు విపక్ష కూటమి ‘ఇండియా’లోని భావసారూప్య పార్టీలు చర్చలను ప్రారంభించాయి.

Update: 2024-01-07 16:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎట్టకేలకు విపక్ష కూటమి ‘ఇండియా’లోని భావసారూప్య పార్టీలు చర్చలను ప్రారంభించాయి. బిహార్‌లో సీట్ల పంపకాల ఫార్ములాపై చర్చించడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఆదివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ అలయన్స్ కమిటీ కన్వీనర్ ముకుల్ వాస్నిక్ నివాసంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ అలయన్స్ కమిటీ సభ్యులు అశోక్ గెహ్లాట్ , సల్మాన్ ఖుర్షీద్ భేటీ అయ్యారు. నేషనల్ అలయన్స్ కమిటీ సభ్యులు భూపేష్ బఘేల్, మోహన్ ప్రకాష్ ఈ మీటింగ్‌కు హాజరుకాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆర్జేడీ ఆవిర్భవించింది. దీంతో ఆ రాష్ట్రంలో సీట్ల కేటాయింపులో తమకు అత్యంత ప్రాధాన్యత దక్కాలని ఆర్జేడీ నేత మనోజ్ ఝా వాదన వినిపించినట్లు తెలిసింది.

పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై..  

ఇక పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల పంపకంపై సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ అలయన్స్ కమిటీ సభ్యులు కూటమిలోని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సమర్పిస్తారు. అనంతరం దాన్ని ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ పరిశీలించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. తమిళనాడులో డీఎంకే, బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ పార్టీలు, జార్ఖండ్‌లోని జేఎంఎంలతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోనుంది. ఇక ఇండియా కూటమికి సంబంధించిన పదవుల కేటాయింపుపై 10-15 రోజుల్లో ఒక నిర్ణయం వెలువడుతుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే వెల్లడించారు.

Tags:    

Similar News