కాంగ్రెస్ తన పాలనలో 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది: నితిన్ గడ్కరీ
కాంగ్రెస్ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు పేదలుగా మిగిలిపోయారని ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని, కానీ తమ హయాంలో 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్సేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి.. కాంగ్రెస్ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు పేదలుగా మిగిలిపోయారని ఆరోపించారు. ప్రజలను మెప్పించడంలో ప్రతిపక్షం విఫలమైంది. అందుకే వారు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. మేము(బీజేపీ) రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చలేమని, సవరణలు మాత్రమే చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఇప్పటివరకు కాంగ్రెస్సే 80 సార్లు రాజ్యాంగంలో సవరణలు చేసిందని' నితిన్ గడ్కరీ అన్నారు. పేదలందరికీ ప్రయోజనాలు అందే వరకు తమ పనిని ఆపేదిలేదు. కాంగ్రెస్ తప్పుడు ఆర్థిక విధానాల వల్ల దేశంలో ప్రజలు పేదలుగా మిగిలిపోయారు. మేము 10 ఏళ్ల నుంచే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ఆరు దశాబ్దాలు అధికారంలో ఉన్న ఏమీ చేయలేదు. తమ పని గురించి చెప్పి ఎన్నికల్లో పోటీ చేయలేకనే ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని గడ్కరీ పేర్కొన్నారు.