'పశువుల స్మగ్లింగ్ కేసులో నిర్థోషి వాహనం జప్తు హక్కుల ఉల్లంఘనే': సుప్రీంకోర్టు
నిర్దోషి వాహనం జప్తు ఆస్తి హక్కును హరించడమే. Confiscation of vehicle despite acquittal violates right to property
దిశ, వెబ్‌డెస్క్ః పశువుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపించిన వాహనాన్ని జప్తు చేయడం అనేది ఏకపక్షంగా ఆస్తిని లాక్కోవడమేనని తాజాగా సుప్రీమ్ కోర్టు అభిప్రాయపడింది. అదే కేసులో వాహన యజమానిని ట్రయల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు వాహనాన్ని జప్తు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం ఆ వ్యక్తి హక్కును హరించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రక్కును విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది.
ఇక, సదరు కేసులో నిందితుడిపై పెట్టిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేనందున అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. 'క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లో అతడు నిర్దోషిగా విడుదలైనప్పుడు అప్పీలుదారు ట్రక్కును జప్తు చేయడం అతని ఆస్తిని ఏకపక్షంగా హరించడమే. ఆర్టికల్ 300A కింద ప్రతి వ్యక్తికీ ఉన్న హక్కును ఉల్లంఘించడమే" అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో, అప్పీలుదారు వాహనం కేవలం క్రిమినల్ ప్రొసీడింగ్‌ల కారణంగా జప్తు చేయబడిందని, అయితే, చట్టం ప్రకారం, విచారణలో నిర్దోషిగా తేల్చినప్పుడు సదరు వ్యక్తి వాహనాన్నినిలిపేసి, దాన్ని రాష్ట్రం జప్తు చేయడం సాధ్యం కాదని కోర్టు వెల్లడించింది. ఇందులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.