దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కలవరం

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,041 కొత్త కేసులు వెలుగు చూశాయి.

Update: 2022-06-03 17:07 GMT

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,041 కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో వైరస్ బారిన పడి 10 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,31,68,585కు చేరింది. మరణాల సంఖ్య 5,24,651కు పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 1,668 కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ఒక్కరోజులో భారీగా కేసులు వెలుగుచూశాయి. ఒక్క శుక్రవారమే 1,134 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 తర్వాత గత 3 నెలల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్కును దాటింది.

ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో సంక్రమణ స్థానికంగా వ్యాప్తి చెందుతుందని కేంద్రం లేఖ రాసింది. 'మహమ్మారిపై పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కోల్పోకుండా ప్రజారోగ్య ప్రతిస్పందనలపై రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కఠినమైన పర్యవేక్షణను నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఏదైనా అభివృద్ధి చెందుతున్న సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలి' అని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. సమిష్టి కృషికి కావాల్సిన సాయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అందజేస్తుందని తెలిపారు. కేరళలో గత వారం రోజుల్లో 6,556 కేసులు వెలుగు చూడగా, మహారాష్ట్రలో 4,883, తమిళనాడులో 659, తెలంగాణలో 375, కర్ణాటకలో 1,446 కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాష్ట్రాల జోక్యం అవసరమని భూషణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదు అంచెల వ్యుహాం ప్రాధాన్యతను ఉద్ఘాటించారు.



Similar News