'బెంగాల్ వాళ్లైనా యూపీ కోర్టులో హిందీలోనే సాక్ష్యమివ్వాలి'

హిందీ జాతీయ భాష అని.. ఉత్తరప్రదేశ్‌లోని ట్రిబ్యునల్స్ ముందు హాజరయ్యే సాక్షులు వేరే రాష్ట్రానికి చెందిన వారైనా హిందీలోనే సాక్ష్యం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-08-04 16:24 GMT

న్యూఢిల్లీ : హిందీ జాతీయ భాష అని.. ఉత్తరప్రదేశ్‌లోని ట్రిబ్యునల్స్ ముందు హాజరయ్యే సాక్షులు వేరే రాష్ట్రానికి చెందిన వారైనా హిందీలోనే సాక్ష్యం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమోద్ సిన్హా వర్సెస్ సురేష్ సింగ్ చౌహాన్ కేసు విచారణ సందర్భంగా జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖా బాద్‌లో ఉన్న మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ)లో పెండింగ్‌లో ఉన్న మోటారు ప్రమాద కేసు ఒకదాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ లో ఉన్న ఎంఏసీటీకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. ఈ కేసులోని సాక్షులందరూ సిలిగురికి (పశ్చిమ బెంగాల్‌) చెందినవారు కాబట్టి.. ఎంఏసీటీ ఫరూఖాబాద్‌ (ఉత్తరప్రదేశ్)లో విచారణ జరిపితే భాష వ్యత్యాసంగా ఉంటుందని వాదిస్తూ నేరం చేసిన వాహన యజమాని కోర్టులో పిటిషన్ వేశాడు.

ఈ వాదనను తోసిపుచ్చిన జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా.."దేశంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ హిందీ మన జాతీయ భాష. అందుకే ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేఘర్‌లో ఉన్న ఫరూఖా బాద్‌ ఎంఏసీటీకి హాజరై సాక్షులు హిందీలో సాక్ష్యాన్ని సమర్పించాలి" అని ఆదేశించారు. క్లెయిమ్ పిటిషన్‌ను ఎంఏసీటీ డార్జిలింగ్‌కు బదిలీ చేయడానికి పిటిషనర్ చూపిన కారణం సముచితమైంది కాదన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జస్టిస్ దత్తా కూడా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే.


Similar News