బీహార్‌లో బాబాయి, అబ్బాయి సవాల్..

ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్‌‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రెండు చీలిక వర్గాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది.

Update: 2023-07-18 11:41 GMT

పాట్నా : ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్‌‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రెండు చీలిక వర్గాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. 2021లో రాంవిలాస్‌ పాశ్వాన్‌ మరణానంతరం ఐదుగురు పార్టీ ఎంపీల్లో నలుగురితో తిరుగుబాటు చేసిన రాంవిలాస్‌ పాశ్వాన్‌ తమ్ముడు పశుపతి కుమార్‌ పరాస్‌ కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పరిణామంతో అలిగిన చిరాగ్‌ పాశ్వాన్‌ అప్పట్లో ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పారు. తాజాగా జులై 17న (సోమవారం) చిరాగ్‌ పాశ్వాన్‌ తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రి పార్లమెంటరీ నియోజకవర్గమైన హాజీపూర్‌ నుంచి పోటీచేస్తామని చిరాగ్ ప్రకటించారు.

2020 సమయానికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మాటలు విని తొందరపాటులో తాను కూటమి నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. అయితే ప్రస్తుతం హాజీపూర్‌ సిట్టింగ్‌ ఎంపీగా చిరాగ్‌ బాబాయి పశుపతి కుమార్ పరాస్‌ ఉన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యలను పరాస్‌ ముందు మీడియా ప్రస్తావించగా అవన్నీ ఉత్తమాటలని కొట్టిపారేశారు. తన నియోజకవర్గ ప్రజలను చిరాగ్‌ పాశ్వాన్‌ మభ్యపెట్టలేడని వ్యాఖ్యానించారు. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎవరిని నిలబెట్టినా తనపై గెలవడం అసాధ్యమని పేర్కొన్నాడు.


Similar News