Heavy Rain: తమిళనాడువ్యాప్తంగా భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పిడన అల్పపీడనం వల్ల తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పిడన అల్పపీడనం వల్ల తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai), తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. పలుటోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం విద్యాసంస్థలకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఉద్యోగులకు ఈనెల 18 వరకు వర్క్‌ఫ్రం హోం (work from home) అవకాశం కల్పించాల్సిందిగా సీఎం ఎంకే స్టాలిన్ ఐటీ సంస్థలకు సూచించారు.
పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
వచ్చే మూడ్రోజుల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడులోని కరైకల్, పుదుచ్చేరి ప్రాంతాల్లో రెండ్రోజుల పాటు తీవ్రమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కేరళలోని మహేలో, అక్టోబర్ 15-17 వరకు భారీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్ర ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కోస్తా ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.