Chandrayaan-3: భూ కక్ష్యను పూర్తి చేసిన చంద్రయాన్-3..

చంద్రయాన్-3 భూమిపై ఐదవ, చివరి కక్ష్యను మంగళవారం పూర్తి చేసింది.

Update: 2023-07-25 12:12 GMT

బెంగళూరు: చంద్రయాన్-3 భూమిపై ఐదవ, చివరి కక్ష్యను మంగళవారం పూర్తి చేసింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. భూమి గురుత్వాకర్షణ శక్తిని వదిలి పెట్టనున్న చంద్రయాన్-3ను చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తన కక్ష్యలోకి లాక్కుంటుంది. చివరికి చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. భూమి చుట్టూ ఐదు కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసిన ఈ అంతరిక్ష నౌక 1,27,609 కి.మీ.x236 కి.మీ.ల చంద్రుడి కక్ష్యను ఆగస్టు ఒకటో తేదీ అర్ధరాత్రి 12 గంటలకు చేరుకోగలదని భావిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

జూలై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగుతుంది. అయితే.. చంద్రుని సూర్యోదయం ఆధారంగా సమయం మారవచ్చు. ఆలస్యమైతే ల్యాండింగ్ సమయాన్ని ఇస్రో సెప్టెంబర్‌కు రీషెడ్యూల్ చేస్తుంది.

చంద్రయాన్-3కి మూడు లక్ష్యాలు..

చంద్రయాన్-3 ఆగస్టు మొదటి వారం నాటికి చంద్రుని చుట్టూ 5-6 సర్కిళ్లను పూర్తి చేసి అంతర్ వృత్తంలోకి ప్రవేశిస్తుంది. రానున్న 10 రోజుల్లో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో కచ్ఛితమైన ల్యాండింగ్ స్పాట్‌ను గుర్తిస్తుందని కేంద్ర అంతరిక్ష మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుంది. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృధువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం.. చంద్రునిపై రోవర్ యొక్క చలన శీలతను ప్రదర్శించడం.. చంద్రుని దక్షిణ ధ్రువంపై శాస్త్రీయ ప్రయోగాలు చేయడం వంటి 3 లక్ష్యాలను చంద్రయాన్-3 పెట్టుకుంది.


Similar News