Chandrayaan-3: చంద్రయాన్ 3లో మ‌రో కీల‌క‌ ఘ‌ట్టం.. స్పేస్‌ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండ‌ర్

చంద్రయాన్‌-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది.

Update: 2023-08-17 11:06 GMT

బెంగళూరు : చంద్రయాన్‌-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ ‘విక్రమ్‌’ విడిపోయే ప్రక్రియ గురువారం సక్సెస్ ఫుల్‌గా జరిగిందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌ బెంగళూరులోని ఐఎస్‌టీఆర్‌ఏసీ కేంద్రానికి ఒక మెసేజ్ పంపింది. "థ్యాంక్స్‌ ఫర్‌ ది రైడ్‌.. మేట్" అని ల్యాండర్‌ మెసేజ్‌‌లో ఉంది. ఈ మెసేజ్ వివరాలను ఇస్రో ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేసింది. ఇక నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ ఒంటరిగానే చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. శుక్రవారం (ఆగస్టు 18) సాయంత్రం 4 గంటలకు డీ-ఆర్బిట్‌-1 ప్రక్రియను, 20న డీ-ఆర్బిట్‌-2 ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ రెండు ప్రక్రియలతో ల్యాండర్‌ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు.

చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగేలా ల్యాండర్‌ కు డైరెక్షన్స్ ఇస్తారు. చంద్రుడి ఉపరితలాన్ని తాకే సమయంలో ల్యాండర్‌ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుందని ఇస్రో తెలిపింది. ఇక ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ప్రస్తుత కక్ష్యలోనే కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని వెల్లడించింది.


Similar News