'మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమే'

మణిపూర్ హింసపై గురువారం నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2023-07-19 15:05 GMT

న్యూఢిల్లీ : మణిపూర్ హింసపై గురువారం నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈవిషయాన్ని తెలిపారు. పార్లమెంట్ సెషన్స్‌కు ముందు సన్నాహకంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సెషన్‌లో మణిపూర్‌ హింసాత్మక ఘటనలపై చర్చ జరపాలన్నారు. దీనిపై గురువారం వాయిదా తీర్మానం తీసుకొస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. విపక్షాల సమస్యలు ఏవైనా సరే నిబంధనల ప్రకారం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. అఖిలపక్ష సమావేశంలో 34 పార్టీలకు చెందిన 44 మంది నేతలు పాల్గొన్నారని తెలిపారు.

ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని కాంగ్రెస్‌ కూటమి యోచిస్తోంది. "ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్, గవర్నర్ల ద్వారా దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి, బాలాసోర్ రైలు దుర్ఘటన, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి తేవడం వంటి అంశాలను కూడా మేం లేవనెత్తుతాం" అని కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటేరియన్ జైరాం రమేష్ అన్నారు. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతామని స్పష్టం చేశారు. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేసే బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, సినిమాటోగ్రఫీ బిల్లు, డేటా ప్రొటెక్షన్ బిల్లు, తాత్కాలిక పన్నుల బిల్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు బ్యాంక్ బిల్లు సహా దాదాపు 31 బిల్లులను ఈసారి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 17 రోజుల పార్లమెంట్ సెషన్‌లో 31 బిల్లులపై చర్చించి, ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


Similar News