Congress-Uddhav Thackeray Rift: అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (యూబీటీ) వర్సెస్ కాంగ్రెస్

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీట్ల పంపకాల పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.

Update: 2024-10-22 06:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీట్ల పంపకాల పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ ఆసక్తి చూపించటం లేదు. విదర్భలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా విదర్భలోనే 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మెజారిటీ సాధించడం అన్ని పార్టీలకు చాలా కీలకం. లోక్‌సభ ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్‌సభ స్థానాలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచి, ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇక.. అధికా కూటమిలోని బీజేపీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్ వర్సెస్ ఠాక్రే

అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 62 సీట్లలో కనీసం 8 సీట్లను కోరుతోంది. విదర్భలో కాంగ్రెస్‌కు పట్టు ఉందని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే, తమ పార్టీకి కూడా 4-5 మంది ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. మరోవైపు.. మహా వికాస్ అఘాడిలో కూటమి నుంచి శివసేన (యూబీటీ) చీలిక సృష్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇక, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘ ఎంవీఏలో 17 సీట్లపై చర్చలు ఇంకా పెండింగ్‌లో ఉంది. కొన్ని సీట్లపై ఠాక్రే వర్గంతో వివాదం ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల పంపకంపై ఆ పార్టీలు సమయం తీసుకుంటాయి’ అని అన్నారు. ఇకపోతే, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Similar News