RG Kar Protest: ఆర్‌జీ కర్ నిరసన ర్యాలీలో 'కశ్మీర్ ఆజాదీ' నినాదాలపై నివేదిక కోరిన కేంద్రం

ర్యాలీలో పాల్గొన్న 15-20 మంది వివాదాస్పద నినాదాలు చేశారని ఐబీ గుర్తించిందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.

Update: 2024-10-02 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌జీ కార్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో 'కశ్మీర్ మాంగే ఆజాదీ' నినాదాలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ర్యాలీలో పాల్గొన్న 15-20 మంది వివాదాస్పద నినాదాలు చేశారని ఆరోపించిన వారిని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు 'కశ్మీర్ మాంగే ఆజాదీ' నినాదాలు వినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదం చెలరేగింది. వీడియో వైరల్ అయిన తర్వాత, కోల్‌కతా పోలీసులు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 152 (భారత సార్వభౌమత్వం, ఐక్యత లేదా సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించినది), 285 (ప్రజా రహదారులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భద్రతకు సంబంధించినది) కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో ర్యాలీ జరిగింది. ఈ సంఘటన దేశంలోని వైద్యులపై ఉన్న పని ఒత్తిడి, దారుణాలపై ఆందోళనలు చెలరేగాయి. పని ప్రదేశాలలో వారి భద్రతకు మార్గదర్శకాలను డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News