Manipur: మణిపూర్ ‘దారుణం’పై కేంద్రం కీలక ఆదేశాలు..

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేసిన ‘దారుణం’పై సీబీఐ దర్యాప్తు నిర్వహించనుంది.

Update: 2023-07-27 16:25 GMT

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం, అత్యాచారం చేసిన ‘దారుణం’పై సీబీఐ దర్యాప్తు నిర్వహించనుంది. ఈ ‘దారుణం’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, పార్లమెంటులో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంతో సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మూడు నెలలుగా జరుగుతున్న హింసాకాండతో పాటు మహిళలపై ‘దారుణ’ ఘటనపై దర్యాప్తును రాష్ట్రం బయట నిర్వహించేందుకు ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది. ఈ దారుణ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలంటూ విపక్షాలు గత వారం రోజులుగా పార్లమెంటును స్థంభింపజేస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. 1993, 1997 సంవత్సరాల్లో దేశంలో భారీ హింసాకాండ జరిగినప్పుడు పార్లమెంటులో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదని, జూనియర్ హోం మంత్రి మాత్రం ఓ ప్రకటనతో సరిపుచ్చారని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. అందుకే.. ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సరిపోతుందని వాదిస్తోంది. మణిపూర్‌లో మూడు నెలలుగా జరుగుతున్న మారణకాండలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినా.. ప్రధాని మోడీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించడం విశేషం.


Similar News