నీట్ పేపర్ లీక్ కేసులో తొలి అరెస్ట్

మరో నిందితుడు అశుతోష్ పేపర్ లీక్‌లో పాల్గొన్న ఆయా అభ్యర్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించినట్టు తేలింది.

Update: 2024-06-27 13:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లో నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టులను ప్రారంభించింది. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ అధికారులు లీకైన ప్రశ్నాపత్రాలను తీసుకున్న వారిని మనీష్ కుమార్ తన కారులోనే తీసుకెళ్లినట్టు గుర్తించారు. 25 మందికి అతనే ఓ స్కూల్‌లో పేపర్లను అందజేశాడు. మరో నిందితుడు అశుతోష్ పేపర్ లీక్‌లో పాల్గొన్న ఆయా అభ్యర్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించినట్టు తేలింది. వీరిద్దరినీ గురువారం విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్టు చేశారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు నమోదు చేసిన కేసులను కూడా తమకు బదిలీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. సీబీఐ అరెస్టులకు ముందు బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోద్రాలో నీట్ అభ్యర్థుల వాంగ్మూలాల సేకరణ..

మరోవైపు, గురువారం గోద్రా పాఠశాలలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల వాంగ్మూలాలను సీబీఐ బృందం నమోదు చేసింది. ఈ అభ్యర్థులు నిందితులకు అడ్వాన్స్ పేమెంట్లు చేసినట్టు అధికారులు తేల్చారు. దాంతో నిందితుల కస్టడీ కోసం న్యాయపరమైన చర్యలను ప్రారంభించేందుకు పంచమహల్‌లోని జిల్లా సెషన్స్ కోర్టుకు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌ను సీల్డ్ కవరులో సమర్పించింది. అలాగే, మే 5న పర్వాడి గ్రామంలోని జే జలరామ్ పాఠశాలలో పరీక్ష జరగడానికి ముందు ఉదయం నిందితులతో టచ్‌లో ఉండటమే కాకుండా, నిందితులకు చెక్కులను ఇచ్చిన విద్యార్థులకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. దాదాపు 30 మంది విద్యార్థులను విచారణ కోసం పిలిచారు. వారిలో కనీసం 15 మంది గుజరాత్‌కు చెందినవారు ఉన్నారు. గోద్రాలోని సర్క్యూట్ హౌస్‌లో వారి నుంచి అధికారులు వాంగ్మూలాలను సేకరించారు.  


Similar News