Bengaluru: దేశంలోనే తొలి 3D పోస్టాఫీస్.. బెంగళూరులో ప్రారంభం

సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది

Update: 2023-08-18 10:26 GMT

బెంగళూరు : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది.. కాగితంపై పదాలు, ఫోటోలు ముద్రించినట్టే.. ఇప్పుడు మొత్తం బిల్డింగ్‌ను దేశంలోనే తొలిసారిగా 3D ప్రింట్‌తో ముద్రించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో ఉన్న 1100 చదరపు అడుగుల స్థలంలో పోస్టాఫీసు భవనాన్ని కేవలం 44 రోజుల రికార్డు  టైంలో 3D ప్రింట్‌తో ముద్రించారు. దీని నిర్మాణ ఖర్చు కూడా బాగా తగ్గింది. ఈ పోస్టాఫీస్‌కు "కేంబ్రిడ్జ్ లేఅవుట్ పోస్ట్" అని పేరు పెట్టారు. ఈ పోస్టాఫీసు భవనాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. 

అనంతరం ఆ బిల్డింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. “బెంగళూరు ఎప్పుడూ మన దేశానికి సంబంధించిన కొత్త చిత్రాన్ని అందరి ముందు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఇక్కడ నిర్మించిన 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనం మొత్తం భారతదేశానికి స్ఫూర్తి. భారతదేశం నేడు పురోగమిస్తోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ త్రీడీ పోస్టాఫీసు నిర్మాణ పనులు మార్చి 21న ప్రారంభమై మే 3న ముగిశాయని అధికారులు వెల్లడించారు. త్రీడీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే దీని నిర్మాణ పనులు పూర్తయ్యాయి.


Similar News