పూరీ ఆలయంలో పోలీసులపై దాడి చేసిన బ్రిటిష్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు
ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించి పోలీసులపై ఎదురు దాడికి దిగిన బ్రిటిష్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించి పోలీసులపై ఎదురు దాడికి దిగిన బ్రిటిష్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయంలోకి దక్షిణ లండన్‌లోని వాండ్స్‌వర్త్‌కు చెందిన థామస్ క్రెయిగ్ షెల్డన్ అనే విదేశీ పర్యాటకుడు శనివారం ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించాడు. దీంతో మందిరం లోపల ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని హిందువులు కాని వారికి ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని కోరారు. అయితే ఆ వ్యక్తి పోలీసులతో దురుసుగా మాట్లాడుతూ వారిపై దాడి చేశాడు. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపై దాడి చేసిన విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నామని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని పూరీలోని సిటీ DSP ప్రశాంత్ కుమార్ సాహు తెలిపారు. ఇంతకుముందు మార్చి 23న ఆలయంలోకి ప్రవేశించినందుకు పోలాండ్‌కు చెందిన మహిళను నిర్బంధించి, విడుదల చేయగా, వారం తర్వాత మళ్లీ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మార్చి 3న కూడా కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా పట్టుబడి, ఆ తర్వాత విడుదలయ్యారు.