బ్రిజ్ భూషణ్ కు హైకోర్టులో నిరాశ!

తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-29 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా బ్రిజ్ భూషణ్ కు నిరాశ ఎదురైంది. 'మీపై వచ్చినఆరోపణలు నిజం కాదని మీరే చెబితే ఎలా నమ్మడం, అసలు ఈ కేసు ఎందుకు కొట్టివేయాలో వివరంగా నోట్ రాసి ఇవ్వండి' హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కొంత గడువునిస్తూ.. కేసు వాయిదా వేసింది.

బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని పలువురు స్టార్ రెజర్లు తీవ్ర ఆరోపణలు, అనేక ఆందోళనలు చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఎట్టకేలకు దిగి వచ్చిన కేంద్రం.. బ్రిజ్ భూషణ్ తో అధ్యక్ష పదవికి రాజీనామా చేయించింది. అంతేకాదు ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్ అక్షింతలు వేశాక గాని రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరగలేదు. విమర్శలకు భయపడి సార్వత్రిక ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కు టికెట్ కూడా ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. అలాగే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు, అవన్నీ అబద్దాలు.. కేసును కొట్టి వేయండి అంటూ బ్రిజ్ భూషణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 


Similar News