VBA List: మహారాష్ట్రలో వీబీఏ తొలి జాబితా.. ఓ ట్రాన్స్‌జెండర్‌ సహా 11 మంది అభ్యర్థుల ఖరారు

ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీడీఏ) తన మొదటి జాబితాను రిలీజ్ చేసింది.

Update: 2024-09-21 18:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీడీఏ) తన మొదటి జాబితాను శనివారం రిలీజ్ చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్‌తో సహా 11 మంది అభ్యర్థులతో లిస్ట్ ప్రకటించింది. పార్టీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్యాండిడేట్స్ పేర్లను వెల్లడించారు. జల్గావ్ జిల్లాలోని రావర్ అసెంబ్లీ స్థానం నుంచి లేవా పాటిల్ వర్గానికి చెందిన ట్రాన్స్‌జెండర్ షమీభా పాటిల్ పోటీ చేస్తారని తెలిపారు. ఇక, సింధ్‌ఖేడ్ రాజా సెగ్మెంట్ నుంచి సవితా ముంధే, వాషిం నుంచి మేఘ కిరణ్ దొంగరే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో వినయ్ బాంగే, నాందేడ్ సౌత్ నుంచి ఫరూక్ అహ్మద్ ఇతరులను ప్రకటించారు.

అలాగే వీబీఏ కూటమి భాగస్వాములైన భారత ఆదివాసీ పార్టీ (బీఏపీ), గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) నుండి ఇద్దరు అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని కుటుంబాల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో బహుజన సమూహాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమితో చేతులు కలపడానికి వీబీఏ ప్రయత్నించింది. అయితే వారి మధ్య చర్చలు ముందుకు సాగలేదు. దీంతో సొంతంగా బరిలోకి దిగింది.  


Similar News