Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం..

మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌

Update: 2023-07-18 11:08 GMT

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 25,000 రూపాయల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్‌లో ఉన్న సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌కు కూడా మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేసింది.

ఇక, బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. జూన్ 2న ఢిల్లీ పోలీసుల ముందు రెండు ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఫిర్యాదులు నమోదు చేశారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు జూన్ 15న కేసులు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలన్నింటినీ బ్రిజ్ భూషణ్ ఖండించారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 1500 పేజీల ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బ్రిజ్‌ భూషణ్ తాజాగా బెయిల్ పొందారు.


Similar News