Brazil: నిలిచిపోయిన సోషల్ మీడియా ఎక్స్ సేవలు

బ్రెజిల్‌లో సోషల్ మీడియా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్‌ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

Update: 2024-08-31 10:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్‌లో సోషల్ మీడియా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్‌ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఇక్కడి ప్రజలకు ఎక్స్‌లోకి లాగిన్‌ అవడం సాధ్యం కావడం లేదు. బ్రౌజర్‌ను రీలోడ్‌ చేసి లాగిన్‌ అవ్వాలని పదేపదే సందేశాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్ లో ఎక్స్ ఎలాంటి న్యాయ ప్రతినిధిని నియమించలేదన్నారు. దీంతో బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి 24 గంటల్లో ఎక్స్ ను ఆపేయమని ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఎక్స్ ఖాతాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. అది ముదిరి ఎక్స్ ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యాపిల్, గూగుల్ కు 5 రోజుల గడువు

మరోవైపు టెక్‌ దిగ్గజాలైన యాపిల్‌, గూగుల్‌కు సుప్రీంకోర్టు 5 రోజుల గడువు ఇచ్చారు. ఈలోపే వాటి ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ అప్లికేషన్ల నుంచి ఎక్స్‌ను తొలగించాలని సూచించింది. అంతేకాదు వీపీఎన్‌ సాయంతో వ్యక్తులు లేదా వ్యాపారసంస్థలు ఎక్స్‌లో లాగిన్‌ అయితే 5 వేల డాలర్ల ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బ్రెజిల్‌లో సోషల్ మీడియా ఎక్స్.. న్యాయ ప్రతినిధిని ఏర్పాటుచేసేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఇకపోతే, బ్రెజిల్ తీర్పుపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. మాట్లాడే స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాదని.. రాజకీయ లబ్ధి కోసం దీన్ని నాశనం చేస్తున్నారని బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జిని విమర్శించారు.


Similar News