హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపులు! నాగ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
జబల్ పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E-7308 విమానంలో బాంబు ఉన్నట్లు ఆదివారం ఉదయం 8 గంటలకు మెయిల్స్ వచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్: జబల్ పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E-7308 విమానంలో బాంబు ఉన్నట్లు ఆదివారం ఉదయం 8 గంటలకు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో ఫ్లైట్ సంస్థ నాగ్ పూర్ విమానాశ్రయంలో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన వెంటనే.. ఈ విమానాన్ని ఆదివారం ఉదయం(సెప్టెంబర్ 1) 8 గంటల ప్రాంతంలో నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. తదనంతరం విమానంలోని ప్రయాణికులను కిందకు దించి, ఫ్లైట్ ను 'ఐసోలేషన్ బే' కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సంస్థ క్షమాపణలు కోరింది.
అయితే, ఐసోలేషన్ బే లో ఫ్లైట్ ను తనిఖీ చేయగా.. బాంబ్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ మధ్య కాలంలో ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్స్, స్కూల్స్ కి బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్ 18 న వారణాసి, చెన్నై, జైపూర్ సహా 41 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానానికి ఆగస్టు 22 న ఇలాగే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.