‘హై ప్రొఫైల్’ డ్రైవింగ్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
దిశ, నేషనల్ బ్యూరో : పూణేలో జరిగిన లగ్జరీ కారు ప్రమాదం కేసును మరువక ముందే.. అలాంటిదే మరో యాక్సిడెంట్ మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : పూణేలో జరిగిన లగ్జరీ కారు ప్రమాదం కేసును మరువక ముందే.. అలాంటిదే మరో యాక్సిడెంట్ మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా లగ్జరీ కారుతో యాక్సిడెంట్ చేసింది ఓ హైప్రొఫైల్ కుటుంబానికి చెందిన యువకుడే. ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు 24 ఏళ్ల మిహిర్ షా ముంబైలోని వర్లీ ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారును అతివేగంతో నడిపాడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అతడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న ప్రదీప్ నఖ్వా (50), అతడి భార్య కావేరి(45)కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించగా.. కావేరి అప్పటికే చనిపోయిందని వైద్యులు డిక్లేర్ చేశారు. ప్రదీప్ నఖ్వా చికిత్సపొందుతున్నాడు. బైక్‌ను ఢీకొన్న వెంటనే ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితుడు మిహిర్ షా, అతడితో ఉన్న డ్రైవర్ రాజరిషి బిదావత్ కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ రాజరిషి బిదావత్, కారు యజమాని, షిండే వర్గం శివసేన నేత రాజేష్ షాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త నేర, న్యాయ చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వారిని దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని సాసూన్ డాక్‌కు వెళ్లి చేపలు కొని.. ఇంటికి తీసుకెళ్తుండగా దంపతులు ప్రదీప్ నఖ్వా, కావేరి ఈ ప్రమాదం బారినపడ్డారు.
గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన మిహిర్ షా
ర్యాష్ డ్రైవింగ్‌తో మహిళ ప్రాణాలు బలిగొన్న కీలక నిందితుడు మిహిర్ షా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఆటోలో పరారైన మిహిర్ నేరుగా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడని, అక్కడ కాసేపు ఉండి వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి గర్ల్ ఫ్రెండ్‌ను కూడా విచారించారు. మిహిర్ షా పబ్ నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. సదరు పబ్ యజమానిని పోలీసులు విచారించగా.. మిహిర్ షా మద్యం తాగలేదని చెప్పాడు. తమకు అందరూ సమానులేనని, ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే అని ఆయన తేల్చి చెప్పారు.