దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ.. మిగతా స్థానాలకూ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. దీనిపై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఇది బుధవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, అదే రోజు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిపారు. ‘‘బుధవారం ఢిల్లీలో పార్టీ మీటింగ్ ఉంది. నేను కూడా వెళ్తున్నా. రెండో విడతలో ప్రకటించే అభ్యర్థుల జాబితా బుధవారం దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. ఆ జాబితాను త్వరలోనే విడుదల చేస్తారు. కర్ణాటకలోని మిగతా అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఇందులోనే ప్రకటించవచ్చు’’ అని తెలిపారు. కర్ణాటకలో ఎంపీ అభ్యర్థులుగా కొత్తవారిని ప్రకటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇందుకు సంబంధించిన వివరాలు తనకు తెలియదని అన్నారు. ఢిల్లీ పెద్దల మనుసులో ఏముందో తనకు తెలియదని, తుది నిర్ణయం వారే తీసుకుంటారని వెల్లడించారు. కాగా, ఈ నెల 2న 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీతోపాటు 34 మంది కేంద్రమంత్రులకు తొలి జాబితాలో చోటు దక్కింది.